• ఈరోజు కృష్ణా జిల్లాలోని పామర్రు శివారు నుండి మొదలైన ప్రజా సంకల్ప యాత్ర
  • దివంగత నేత ఎన్టీ రామారావు స్మృతులను తలచుకున్న వైసీపీ అధినేత
  • ధర్మపోరాట సభ అంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలోని పామర్రు శివారు ప్రాంతం నుండి మొదలైంది. ‘కూచిపూడి’ ఆవిర్భవించిన నేల, దివంగత ఎన్టీ రామారావు జన్మభూమి ప్రాంతం అయినా పామర్రు నియోజకవర్గంలో అడుగిడగానే దివంగత నేత స్మృతులను జగన్ తలచుకున్నారు. ఈ మేరకు జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టర్ ని పెట్టారు. పామర్రు నియోజకవర్గం సమీపంలోని నిమ్మకూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి.. స్వశక్తితో ఎదిగి.. తెలుగు సినీ రంగంలో ఉజ్వలంగా వెలుగొంది.. రాజకీయ పార్టీని స్థాపించి.. అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి.. జీవిత చరమాంకంలో తీవ్ర మానసిక క్షోభకు గురై అశువులుబాసిన ఎన్టీ రామారావు స్మృతులు తన మదిలో మెదిలాయని జగన్ పేర్కొన్నారు.

అధికార పార్టీ లు సరిగ్గా నాలుగేళ్ల కిందట ఏప్రిల్‌ 30న వెంకన్న సాక్షిగా తిరుపతిలో సభ పెట్టి మరీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చాయని, పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తెస్తాను.. అంటూ ఆర్భాటం చేశారని జగన్ మండిపడ్డారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను భూస్థాపితం చేస్తూ.. హోదాకు వెన్నుపోట్లు పొడుస్తూ నాలుగేళ్లకాలం వెళ్లదీసిన చంద్రబాబు.. నేడు ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస సంకోచం కూడా లేకుండా ధర్మపోరాట సభ అంటూ కొత్త నాటకానికి తెరలేపడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని అందుకు నిరసనగానే.. రాష్ట్ర ప్రజలను ఎలా వంచించారో అర్థం కావాలనే.. వైఎస్సార్‌సీపీ విశాఖలో వంచన వ్యతిరేక దినం పాటిస్తోందని జగన్ అన్నారు. అలాగే హోదా విషయమై పలుమార్లు చంద్రబాబుని సూటిగా ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని తిరుపతి సభలోనైనా తన ప్రశ్నలకు సమాధానం చెప్పే నిజాయితీ, ధైర్యం చంద్రబాబుకి ఉన్నాయా? అంటూ జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments