• శ్రీకృష్ణుడి జన్మస్థానం వెళ్తాననే భయం బాబుకు పట్టుకుంది
  • కాంగ్రెస్‌తో కలిసి వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టారు
  • వైఎస్‌ జగన్‌ అంటే ఐదు కోట్ల మంది గుండె చప్పుడు
  • వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

ప్రత్యేక హోదాపై ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీక్షాదక్షత చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అందుకే సీఎం దొంగ నాటకాలు, దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను చేసిన అవినీతికి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్తాననే భయం చంద్రబాబులో ఉందని,  అందుకే అందరూ తనకు కాపలా ఉండాలని ప్రజలను అడుగుతున్నారంటూ అనిల్‌ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అందరికి తెలిసిపోయిందని, జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు ఎవరూ నిద్ర కూడా పోరని వ్యాఖ్యానించారు.

నాడు కాంగ్రెస్‌తో కుట్రపన్ని వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ కూడా సరైన వర్షాలు లేవని, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడైనా చంద్ర గ్రహణం ఒక్క రోజే ఉంటుందని, కానీ ఏపీ ప్రజలకు మాత్రం ఐదేళ్లు చంద్రబాబు గ్రహణం పట్టిందని మండిపడ్డారు. మండే సూర్యుడిలా వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి గ్రహణాన్ని తొలగించుకుందామంటూ పిలుపునిచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments