దేశ రాజకీయాల్లో తనను మించిన సీనియర్ లేరని చంద్రబాబు నాయుడుకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. బహుశా అందుకే ఆయన మరొకరితో సహచరుడిగా కలసి ఉండలేరని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. అలాంటి చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా వారితో కలిసి అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

కేసీఆర్ వెంట నడవడానికి బాబు సిద్ధపడతారా? లేదా, నాయకత్వం తనకు కావాలని పట్టుబడతారా? లేదా, తతిమ్మా అని కూటమిలలో ఆయన గతంలో వ్యవహరించినట్లుగా తన అవసరం తీరిన వెంటనే.. ఆ కూటమికి ఛీకొట్టి.. దూరం వెళ్లిపోతారా? అనే చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి.

కేసీఆర్.. తాను సంకల్పిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి చాలా ముమ్మరంగానే పావులు కదుపుతున్నారు. కేవలం కొన్ని వారాల కిందట బెంగుళూరు వెళ్లి జనతాదళ్ ఎస్ నేత దేవెగౌడతో మంతనాలు జరిపిన కేసీఆర్.. రెండు వారాల తర్వాత.. చెన్నై వెళ్లి ప్రస్తుతం యూపీఏలో ఉన్న డీఎంకే తోనూ తన ప్రతిపాదనను ఆయన ముందుంచారు. డీఎంకే అధినేతలు ఎలా స్పందించారో తెలియదు గానీ.. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.. ఈ ఫ్రంట్ గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చిస్తానంటూ కేసీఆర్ వెల్లడించారు.

అయితే కేసీఆర్ తనకంటె ఎంతో జూనియర్ అని బహిరంగంగానూ, తన ముందు కేసీఆర్ బచ్చా అని ఆంతరంగికులతోనూ వ్యాఖ్యానిస్తారనే పేరున్న చంద్రబాబునాయుడు కేసీఆర్ ప్రతిపాదించే ఫ్రంట్ లో ఆయన నాయకత్వంలో ముందడుగు వేయడానికి సిద్ధంగానే ఉన్నారా? అనేది ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు పదేపదే తాను ఒకప్పట్లో జాతీయ రాజకీయాల్లో ఎంత కీలకమైన నాయకుడినో చెప్పుకుంటూ ఉంటారే తప్ప.. వాస్తవంలో ఇప్పుడు ఆయన ఆ రకంగా ఎంత ప్రభావం చూపగలరో నిరూపించుకోవడం లేదు.

పైగా చంద్రబాబు అవసరంతో నిమిత్తం లేకుండా.. మూడో కూటమికి సంబంధించిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ముమ్మరంగా జరిగిపోతున్నాయి. కేసీఆర్ ఒకవైపున, మరోవైపున మమతా బెనర్జీ ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాను నేతృత్వం వహించాలని చంద్రబాబు పట్టుబడితే ఆయనకు ఎదురుదెబ్బ తప్పదనే అంచనాలున్నాయి. అందుకని కేసీఆర్ ప్రతిపాదనకు ఓకే చెప్పడం తప్ప గత్యంతరం లేదనే వాదన కూడా ఒకటి వినవస్తోంది. మరి చంద్రబాబు ఆలోచన, వ్యూహం ఎలా ఉన్నదో వేచిచూస్తే గానీ తెలియదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments