• ఆవిడ గురించి మాట్లాడదలచుకోలేదు
  • మైఖేల్ కోర్సలే స్నేహితుడు మాత్రమే
  • పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు
  • సుదీర్ఘ ప్రయాణం తరువాత విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది

తన జీవితంలో గౌతమి అనే మహిళ లేనేలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ పేర్కొంది. ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, కమలహాసన్, గౌతమి విడిపోవడానికి కారణం మీరే అన్న ప్రచారంపై స్పందించాలని కోరగా సమాధానం ఇచ్చింది. తన జీవితంలో లేని ఆవిడ గురించి తాను మాట్లాడదలచు కోవడం లేదని స్పష్టం చేసింది. మైఖేల్ కోర్సలేతో ఉన్న పరిచయంపై మాట్లాడుతూ, తను స్నేహితుడు మాత్రమేనని, ఆ విషయంపై అంతకన్నా ఏమీ చెప్పలేనని అంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన తనకు లేదని, రహస్యాలేమీ లేవని, ఏదైనా ఉంటే దాచుకోకుండా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.

పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు సమాధానం తన వద్ద లేదని, ఏదేమైనా తన అభిప్రాయానికి ఇంట్లోని వారందరూ విలువను ఇస్తారని తెలిపింది. ఇక తండ్రి ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అవగాహన లేకుండా తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని, సమాజానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, రాజకీయ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఆలోచిస్తానని వ్యాఖ్యానించింది. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత కొంత విరామం తీసుకోవాలని తనకు అనిపించిందని, ఇప్పుడు మళ్లీ కథలు వింటున్నానని, త్వరలోనే కొత్త సినిమాకు సంతకం చేస్తానని చెప్పింది.

తెలుగు భాష మాట్లాడేవాళ్లు తన చుట్టూ లేకపోవడంతో ఈ ఏడాది వ్యవధిలో కొంత మరచిపోయానని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు కొన్ని పదాలు తొందరగా రావడం లేదని, అయితే తాను తెలుగును పూర్తిగా మరచిపోలేదని చెప్పింది. ఇటీవలే ‘అర్జున్ రెడ్డి’ సినిమాను చూశానని, తనకెంతో నచ్చిన విభిన్నమైన సినిమా అదని చెప్పింది. సినిమా నిర్మాణంతో పాటు సంగీతం, రచన తదితర విషయాలపైనా దృష్టిని సారించానని వెల్లడించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments