ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ వరుస ఓటములతో సతమౌతోంది. టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబయి జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే లీగ్‌లో ఇక ఆ జట్టు ఆడే మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ముంబయి ఇండియన్స్‌ జట్టుకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వస్తున్న కెప్టెన్‌ రోహిత్‌శర్మను ఓపెనర్‌గా రావాలని చెప్పాడు. ‘రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా వస్తే రాణించే సత్తా ఉన్న ఆటగాడు. టీమిండియా తరఫున ఎన్నో మ్యాచ్‌ల్లో రుజువు చేశాడు. కాబట్టి ఓపెనర్‌గా రావాలి. జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తే భారీ స్కోర్లు సాధించే అవకాశముంది. జట్టు కొన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత రోహిత్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే చాలా ఒత్తిడి ఎదుర్కోవల్సి వస్తుంది. అదే ఓపెనర్‌గా వస్తే ముంబయికి కలిసొస్తుంది. ఒకసారి రోహిత్‌ 30 పరుగులు సాధించే వరకు క్రీజులో ఉంటే చాలు… ఆ తర్వాత భారీ స్కోరు సాధిస్తాడు. పొలార్డ్‌ సరిగా ఆడటం లేదు… అతని స్థానంలో జేపీ డుమినికి తుది జట్టులో స్థానం కల్పించాలి’ అని సన్నీ సూచించాడు.

మరి సన్ని ఇచ్చిన సలహాలను రోహిత్‌ పాటించి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తాడో లేదో చూద్దాం. టోర్నీలో భాగంగా ఈ రోజు ముంబయి… చెన్నైను ఢీకొట్టనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments