• బాలయ్య ముక్కుసూటిగా మాట్లాడతారు
  • మనసులో బాధను ఆయన వ్యక్తపరిచి ఉండవచ్చు
  • మోదీలాంటి పెద్ద వ్యక్తికి గౌరవం ఇచ్చి ఉండాల్సింది

ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష సమయంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ వస్తే తరిమితరిమి కొడతామని, పెళ్లాన్ని గౌరవించడం ముందు ఆయన నేర్చుకోవాలని విమర్శించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్నే రేపాయి.
ఈ వ్యాఖ్యలపై నటుడు, కర్ణాటక బాగేపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయిన సాయికుమార్ స్పందించారు. ఒక తెలుగువాడిగా చెబుతున్నానని… బాలయ్య చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఎన్టీఆర్ లాగానే బాలయ్య కూడా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఆయనకు ఆవేశం ఎక్కువని చెప్పారు. బాలయ్యను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నానని అన్నారు.
అయితే, మోదీలాంటి పెద్ద వ్యక్తిని గౌరవించాల్సి ఉందని, కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, మనసులో ఉన్న బాధను బాలయ్య ఆ విధంగా వ్యక్తపరిచి ఉండవచ్చని అన్నారు. కానీ, వ్యక్తపరిచిన విధానం మాత్రం బాగోలేదని చెప్పారు. తాను బీజేపీలో ఉన్నానని… తన పార్టీ ఏపీకి మంచి చేయాలనే ఒక తెలుగువాడిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలనేది తన కోరిక అని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments