పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఫొటో ఉండడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్ణణ వాతావరణం నెలకొంది. పెదవేగి మండలంలోని పెదకమిడి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పెదకమిడి గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను వారించి, పరిస్థిని అదుపు చేశారు.
పెదకమిడి గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో వెలసిన ఈ ఫ్లెక్సీని వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీలో అటు, ఇటు దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ ఉండగా వారి మధ్య జగన్, అబ్బయ్య ఫొటోలు ఉన్నాయి. అందులోనే కొడాలి నాని బొమ్మకూడా ఉంది. ఈ ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.