2007లో సరిగ్గా ఇదే రోజున బ్రిడ్జ్‌టౌన్‌లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో 104 బంతులు ఎదుర్కొన్న గిల్‌క్రిస్ట్ 8 సిక్సర్లు, 13 ఫోర్లతో 149 పరుగులు చేసి ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే, గిల్‌క్రిస్ట్ ఇలా విరుచుకుపడడం వెనక ఓ రహస్యం కూడా ఉంది. ఆ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
సెంచరీ పూర్తి చేసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి అభివాదం చేస్తూ తన గ్లోవ్స్‌లో ఉన్న బంతిని చూపించాడు. గ్రిప్ కోసం గ్లౌజులో స్క్వాష్ బంతిని పెట్టుకున్నట్టు చెప్పాడు. గిల్ క్రిస్ట్ ఇలా గ్లోవ్స్‌లో బంతి పెట్టుకుని బ్యాటింగ్ చేయడం వివాదాస్పదమైంది. క్రికెట్ స్ఫూర్తిని గిల్ క్రిస్ట్ దెబ్బ తీశాడని శ్రీలంక ఆరోపించింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 36 ఓవర్లలో 269గా నిర్ణయించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 36 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.