దిల్లీ డేర్‌డెవిల్స్‌ వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు గౌతమ్‌ గంభీర్‌. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ ఉచితంగా ఆడతానని, ఎలాంటి నగదు తీసుకోనని తెలిపాడు. తాజాగా గౌతి గురించి మరో ఆసక్తికకరమైన విషయం తెలిసింది.

అదేంటంటే.. టోర్నీలో భాగంగా శుక్రవారం దిల్లీ డేర్‌డెవిల్స్‌ – కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గౌతమ్‌ గంభీర్‌ ఆడలేదు. గంభీర్‌కు జట్టు యాజమాన్యం పెద్ద షాకిచ్చింది. తుది జట్టు నుంచి తప్పించింది అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తెలిసింది ఏమిటంటే… తనను తుది జట్టులోకి ఎంపిక చేయవద్దని గౌతినే చెప్పాడట. ఇది తెలిసి అభిమానులు షాకయ్యారు.

మ్యాచ్‌ అనంతరం దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా గౌతికి తుది జట్టులో చోటు లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందించాడు. ‘నిజం చెబుతున్నాను. ఇది నా నిర్ణయం కాదు. గౌతిని జట్టు నుంచి మేము తప్పించలేదు. ఇది పూర్తిగా గౌతి తీసుకున్న నిర్ణయం. మ్యాచ్‌కు ముందు వచ్చి తనను తుది జట్టులోకి ఎంపిక చేయవద్దని చెప్పాడు. ఇది నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం. గత మ్యాచ్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు ఆడనన్నాడు. గౌతి అలా చెప్పగానే అతనిపై మాకు ఉన్న గౌరవం ఇంకాస్త పెరిగింది’ అని అయ్యర్‌ వివరించాడు.

గౌతి స్థానంలో జట్టులోకి వచ్చిన మున్రో.. పృథ్వీ షాతో కలిసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో దిల్లీకిది రెండో విజయం మాత్రమే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments