civils_0

  • సత్తా చాటిన తెలుగు తేజాలు
  • 24 ర్యాంక్‌ సాధించిన ’పశ్చిమ’ కుర్రాడు
  • సత్తా చాటిన పలువురు ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు

ఓవైపు మల్టీనేషన్‌ కంపెనీ (ఎంఎన్‌సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి..  కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించాడు  పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్‌. ముంబైలో ఎలక్టిక్రల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత సామ్‌సంగ్‌ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో  పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు.

100వ ర్యాంకు సాధించిన నారపురెడ్డి మౌర్య
వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలంలోని నాగులపల్లెకు చెందిన రైతు నారపురెడ్డి ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య యూపీఎస్సీ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో స్వామి వివేకానంద ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది.

206వ ర్యాంక్‌:  నాగవెంకట మణికంఠ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీహెచ్‌ నాగవెంకట మణికంఠ సివిల్‌ సర్వీసెస్‌లో 206 ర్యాంక్‌ సాధించారు. ప్రకాశం జిల్లా మార్టురులో ఇంటర్‌ వరకు చదివిన మణికంఠ బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేశారు.  2017లో ఇండియన్‌ ఫారెస్టు సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఆయన తండ్రి సీహెచ్‌ మంగాచారి ఫొటోగ్రాఫర్, తల్లి శారదాదేవి గహిణి.

512వ  ర్యాంక్‌: ప్రవీణ్‌చంద్‌
తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించారు. పాట్నా ఐఐటీలో ఎలక్టిక్రల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ప్రవీణ్‌ చంద్‌ ..నలుగురికీ సేవచేయాలనే లక్ష్యంతో తన బెంగళూరులో తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. 2016లో సివిల్స్‌కు ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. 2017 జూన్‌లో ప్రిలిమ్స్‌లోను, అక్టోబర్‌లో మెయిన్స్‌ పరీక్షలు రాసి, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 512వ ర్యాంకు సాధించాడు.

కోచింగ్‌ తీసుకోకుండానే 374వ ర్యాంకు
2017 సివిల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లాలోని వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండా సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

245వ ర్యాంకు: చందీష్‌
చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్లపల్లి గ్రామానికి   జి. చందీష్‌ సివిల్స్‌లో 245వ ర్యాంకు సాధించారు.  తనను ఐపీఎస్‌గా చూడాలన్నదే తన అమ్మానాన్న కోరిక అని తెలిపారు.

513వ ర్యాంకు: ప్రసన్నకుమారి
అనంతపురం జిల్లాకు చెందిన ప్రసన్న కుమారికి సివిల్స్‌ ఫలితాల్లో  513వ ర్యాంకు పొందారు. తాడిపత్రి రూరల్‌ మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమారి బీటెక్‌ను 2014లో పూర్తి చేసి 2015 నుంచి సివిల్స్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించారు.  ఇటీవల విడుదలైన గ్రూప్‌–1లోనూ డీఎస్పీ పోస్టు దక్కింది. సేవాభావమే సివిల్‌ సర్వీసెస్‌ వైపు వెళ్లేలా చేసిందని ప్రసన్న కుమారి తెలిపారు.

884 ర్యాంకు: వంశీ దిలీప్‌
2017 సివిల్స్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఇరుకుపాలెంకు చెందిన మీరావత్‌ వంశీదిలీప్‌ 884వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి డాక్టర్‌ మీరావత్‌ గోపినాయక్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఐదేళ్లపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు.  వరంగల్‌ నిట్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలో క్యాంపస్‌ సెలక్షన్‌లో తమిళనాడు నైవేలీలో నెలకు రూ.67వేల వేతనానికి ప్రై వేటు కంపెనీలో ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలిపెట్టి ఢిల్లీలో కోచింగ్‌లో చేరాడు. ఒకసారి సివిల్స్‌ మెయిన్స్‌ వరకు, మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. మూడోసారి పట్టుదలతో చదివి 884వ ర్యాంకు సాధించాడు. తన తండ్రి జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను చూసి ప్రజలకు సేవలు అందించేందుకు సివిల్స్‌ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ దిలీప్‌ తెలిపాడు.

6వ ర్యాంకు శ్రీహర్ష
ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం జయనగర్‌ కాలనీకి చెందిన కోయ శ్రీహర్ష శుక్రవారం వెలువరించిన సివిల్స్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్‌ సాధించారు. ఈయన తల్లిదండ్రులు కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీహర్ష 1 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు బల్లేపల్లి ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను హైద రాబాద్‌లోని నారాయణ కళాశాలలో, ఇంజనీరింగ్‌ను ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌లో పూర్తి చేశారు. 2012లో సిగ్నోర్‌ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని పొంది.. హైదరాబాద్, గుజరాత్‌లో పనిచేసిన ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2017 సివిల్స్‌ పరీక్షలో ప్రతిభను చాటి, శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 6వ ర్యాంక్‌తో సత్తా చాటారు.

22 ఏళ్లకే సివిల్స్‌.. హైదరాబాద్‌ కుర్రాడి ఘనత
హెదరాబాద్‌ కుర్రాడు సాయి తేజ మొదటి ప్రయత్నంలోనే 22ఏళ్లకే  సివిల్స్‌లో 43వ ర్యాంకు సాధించారు. ఆయన మాటల్లోనే…‘ హైదరాబాద్‌(మలక్‌ పేట). నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఐఐటీ, హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాను. 2016లో బీటెక్‌ పూర్తవుతూనే సివిల్స్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించాను.  2017 జూన్‌లో ప్రిలిమ్స్‌ రాశాను. పబ్లిక్‌ సర్వీసులోకి రావాలని, సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా సమాజానికి ఎంతో చేయొచ్చని భావించి సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను.  నాన్న సివిల్స్‌ ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని చెబుతుండటం కూడా నేను సివిల్స్‌ వైపు రావడానికి కారణం. సివిల్స్‌కు చాలా తక్కువ పుస్తకాలు చదివా.  క్రమశిక్షణతో అంకితభావంతో ప్రిపరేషన్‌ కొనసాగించా. ఆయా అంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం లాభించింది. పొలిటికల్‌సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను ఆఫ్షనల్‌గా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన,  అంతర్జాతీయ అంశాలను అడిగారు. నమ్మకం, పట్టుదలతోనే విజయం సాధించా’.

జేసీ కుమారుడికి 393 ర్యాంక్‌
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్‌ సివిల్స్‌లో 393 ర్యాంకు సాధించారు. గతంతో మెయిన్స్‌ వరకు వెళ్లిన ఆదర్స్‌ ఈసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. సివిల్స్‌ సాధించాలన్నది తన కల అని.. ఇందుకోసం కష్టపడి చదివినట్లు చెప్పారు.

అమ్మానాన్న పోత్సాహంతోనే: సాయినాథ్‌రెడ్డి
యూపీఎస్సీ శుక్రవారం వెల్లడించిన సివిల్స్‌ తుది ఫలితాలలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఆలిండియా 480వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి భాగ్యలక్ష్మి, లింగారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు సాయినాథ్‌రెడ్డి. ఒకటి, రెండు తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకొని ర్యాంక్‌ సాధించాడు.

607వ ర్యాంకు: కృష్ణకాంత్‌ పటేల్‌
సివిల్స్‌లో 607వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్‌ కావాలనేది నా చిన్ననాటి కల. 2011లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అప్పటినుంచి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఉన్నాను. ఇప్పటివరకు 5 సార్లు సివిల్స్‌ రాశాను. 2016లో ఎస్‌ఎస్‌బీలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (డీఎస్పీ ర్యాంకు)ఉద్యోగానికి ఎంపికయ్యాను. సివిల్స్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్‌ఎస్‌బీ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నిసార్లు ఓటమి వచ్చినా పట్టుదల వదలకుండా కష్టపడ్డాను. నా విజయానికి తల్లిదండ్రులు, మా అన్నయ్య తోడ్పాటు అందించారు. పాజిటివ్‌గా ఆలోచించడమే నా సక్సెస్‌ మంత్ర.

624వ ర్యాంకు: ఎడవెల్లి అక్షయ్‌కుమార్‌
మాది వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ. మా తాత, తండ్రి ఇద్దరు పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే  పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. అందుకే సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించా.  నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు కొనసాగిస్తున్నాడు.  బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ భూపాల్‌లోని నిట్‌లో పూర్తి చేశాను. క్యాంపస్‌ ఇంటర్య్వూలో దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది.. కానీ ఐపీఎస్‌ కావాలనే లక్ష్యంతో వదులుకున్నా.

జాతీయ స్థాయిలో 726వ ర్యాంక్‌
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు (23) చిన్నవయస్సులోనే సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2012–16 విద్యాసంవత్సరంలో ఢిల్లీలో బీటెక్‌(మెకానికల్‌) కోర్సు పూర్తి చేసి సివిల్‌ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమయ్యారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments