బహిరంగ విసర్జనకు చెక్ పెట్టే విధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ విసర్జన రహిత, స్వచ్ఛ గ్రామాలుగా నిరూపించుకోలేని గ్రామాలకు ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. బహిరంగ విసర్జన జరగడం లేదనీ.. పూర్తి స్వచ్ఛత పాటిస్తున్నారని స్థానిక అధికార యంత్రాంగం సర్టిఫికెట్ ఇచ్చిన గ్రామాలకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఆమె ట్విటర్లో వెల్లడించారు. ఇందుకు గానూ మే 31 వరకు నాలుగు వారాల గడువు కూడా విధించినట్టు సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సగం మందికి పైగా ఉచిత బియ్యం అందిస్తున్నామని ఆమె గుర్తుచేశారు. అందువల్ల పుదుచ్చేరిలోని గ్రామాలన్నీ బహిరంగ విసర్జనకు స్వస్తి పలికినట్టు నిరూపించుకోవాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్తపడవేయడం, ప్లాస్టిక్ వాడకానికి పూర్తిగా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
కాగా పుదుచ్చేరి గ్రామాలను స్వచ్ఛత గ్రామాలు మార్చేందుకు ఆమె నిర్ణయం బాగుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా.. అది చాలా కష్టమంటూ మరికొందరు మండిపడ్డారు. ‘‘ఈ రెండిటికీ ముడిపెట్టడం తెలివైన పనికాదు. పరిశుభ్రత, ఆకలి రెండూ ఒకే ఒరలో ఇమడడం కష్టం..’’ అని ఓ నెటిజన్ పేర్కొనగా.. ‘‘బియ్యం కొనుక్కోలేని వాళ్లు టాయిలెట్ కట్టుకోగలరా? అసలు ఇందులో లాజిక్ ఏమైనా ఉందా..?’’ అంటూ మరొకరు సూటిగా ప్రశ్నించారు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments