స్టార్ హీరోకు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి పదిహేనేళ్ళు దాటుతున్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్న మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర ఈ రోజు రిలీజైంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వాయిదా పడుతూ వచ్చిన విడుదల ఎట్టకేలకు ముహూర్తం సెట్ చేసుకుంది. కామెడీ బ్రాండ్ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి కాంబో మూవీ కావడంతో కాసేపు నవ్వుకుని సరదాగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందేమోనన్న కనీస అంచనాలు అయితే దీని మీద ప్రేక్షకుల్లో ఉన్నాయి. హీరోతో సమానంగా బ్రహ్మానందం క్యారెక్టర్ ని కూడా ప్రమోషన్ లో బాగా ఎలివేట్ చేయటం కూడా ఆసక్తిని పెంచింది. మరి తక్కువ హైప్ తో సడన్ షాక్ ఇస్తుందేమో అన్న అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ 
కృష్ణమాచారి(మంచు విష్ణు), అప్పలాచారి(బ్రహ్మానందం)పౌరోహిత్యం చేసుకునే గురుశిష్యులు. చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంటికి హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. దాని వెనుక రేణుక పెద మావయ్య సుబ్బరాజు(ప్రదీప్ రావత్)కొడుకు విక్కీ(ఠాకూర్ అనూప్ సింగ్)ఉంటాడు. హోమం చివరి రోజు పొగ తట్టుకోలేక చక్రపాణి చనిపోతాడు. రేణుక మాయమైపోతుంది. తను అమెరికా వెళ్లిందని తెలుసుకుని స్కెచ్ వేసి టీమ్ మొత్తాన్ని అక్కడికి తీసుకువెళతాడు కృష్ణమాచార్య. అక్కడ రేణుక నిశ్చితార్థం విక్కీతో ఫిక్స్ అయ్యి ఉంటుంది. కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ
నటీనటులు
మంచు విష్ణుకు హీరోగా ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలు ఒడ్డు పొడవు, తీరు తెన్ను అన్ని ఉన్నప్పటికీ అందరికి నచ్చే కంప్లీట్ మెటీరియల్ కాదు అతను. అందుకు విష్ణు సక్సెస్ సాధించిన సినిమాలు అన్ని ఒకసారి గమనిస్తే అతని భుజాల మీద సోలోగా నడిపించి హిట్ కొట్టినవి కనిపించవు. ఇది పసిగట్టే శీను వైట్ల, నాగేశ్వర్ రెడ్డి లాంటి దర్శకులు కామెడీతో నడిపించేసే సినిమాల ద్వారా సక్సెస్ రుచి చూపించగలిగారు. అలాగని అల్లరి నరేష్ తరహాలో విష్ణుని అదే పనిగా హాస్య చిత్రాల్లో చూడటం కష్టమైన పనే. కాకపోతే చాలా బలమైన కంటెంట్ ఉంటే ఏదోలా నెట్టుకురావచ్చు కాని ఆచారి అమెరికా యాత్రలో అంత విషయం లేకపోవడంతో విష్ణు చాలా పరిమితంగా కనిపిస్తాడు. ఉన్నంతలో తన టైమింగ్ తో నిలబెట్టే ప్రయత్నం చేసాడు
కాని గతంలో వచ్చిన దేనికైనా రెడీ, అదుర్స్ లాంటి సినిమాల ఛాయలు కనిపించడంతో నటన పరంగా ప్రత్యేకత ఏమి కనిపించదు. అయినా కూడా విష్ణు మరీ నిరాశ పరచలేదు. ప్రగ్య జైస్వాల్ కొంచెం ట్రై చేసినప్పటికీ తనవరకు చేయాల్సింది చేసింది. గ్లామర్ పరంగా ఒకే. బ్రహ్మానందం సినిమాను నిలబెట్టే ప్రయత్నం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ స్క్రిప్ట్ తో పాటు డైలాగులు మరీ పేలవంగా ఉండటంతో విసుగొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి పాత్రలు వందల్లో చేసిన బ్రహ్మానందంని కొత్తగా చూడాలి అని కోరుకోవడమే ప్రేక్షకుల తప్పుగా కనిపిస్తోంది కాబోలు. మళ్ళీ మళ్ళీ అవే పాత్రల్లో చూపిస్తున్నారు.
విలన్స్ గా ప్రదీప్ రావత్, టాకూర్ అనూప్ సింగ్, రాజా రవీంద్ర లను ఇలాంటి పాత్రల్లో గతంలోనే చూసేసాం కాబట్టి కొత్తదనం ఏమి లేదు. ప్రవీణ్, ప్రభాస్ శీను, పృథ్వి, పోసాని, వేణు,సత్య కృష్ణ, సురేఖ వాణి, రాజా రవీంద్ర, సుప్రీత్, గీత సింగ్, మాస్టర్ భరత్ ఇలా కామెడీని మోయడానికి పెద్ద టీం ఉన్నప్పటికీ ఎవరిని పూర్తిగా వాడుకోలేదు. కోట శ్రీనివాసరావు జస్ట్ క్యామియో కనిపిస్తారు అంతే.
సాంకేతిక వర్గం 
దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డికి గతంలో వచ్చిన సక్సెస్ లను గమనిస్తే చాలా సిల్లీ కామెడీతో అలా అలా టైం పాస్ చేయించడంలో వర్క్ అవుట్ చేసుకున్నాడు కాబట్టి కొన్ని హిట్స్ అతని ఖాతాలో ఉన్నాయి. కాని ఈవివి సత్యనారాయణ, జంధ్యాల తరహాలో కలకలం నిలిచిపోయే క్లాసిక్స్ తీసేంత క్యాలిబర్ అయితే ఈయనలో లేదు. గత రెండు డిజాస్టర్లు అదే ఋజువు చేస్తే ఇది దాన్ని బలపరిచింది. సీమ శాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ సినిమాలు వర్క్ అవుట్ అవ్వడానికి కారణం అందులో సినిమా చివరి దాకా కూర్చోబెట్టే అంశాలు కనీస స్థాయి కంటే ఎక్కువగా ఉండటం. కాని ఆ ఫార్ములానే నమ్ముకుని అదే పనిగా మళ్ళి మళ్ళి సినిమాలు తీస్తే దెబ్బ తప్పదని నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాతో అయినా తెలుసుకోకపోతే ఎక్కువ కాలం నిలవడం కష్టం.
ఇలాంటి హాస్య సినిమాలకు బలంగా ఉండాల్సిన సంభాషణల విషయంలో కనీస శ్రద్ధ తీసుకోకపోవడంతో రెండుంపావు గంటల సేపు ఏదో ఒకటి తీసుకుంటూ పోతే చాలు అన్న రీతిలో సాగటమే అసలు మైనస్. పంతులు టైలర్ లాగా హీరోయిన్ కొలతలు తీసుకోవడం, బీచ్ లో సురేఖా వాణితో బ్లర్ చేసేంత ఎక్స్ పోజింగ్ చేయించడం అంతా అర్థం పర్థం లేని వ్యవహారాలే. ఎప్పుడో దశాబ్దాల వెనుక మల్లాది గారు రాసిన ఒక సూపర్ హిట్ నవలను తీసుకున్న నాగేశ్వర్ రెడ్డి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేయాలి అనుకోకపోవడం ముమ్మాటికి తప్పే. దాని ఫలితం తెరపై కనిపిస్తుంది. ఏదో మొక్కుబడిగా అమెరికాలో గురు శిష్యుల కామెడీని చూపించిన నాగేశ్వర్ రెడ్డి సెకండ్ హాఫ్ మొత్తంగా గాడి తప్పాడు. లాజిక్స్ లేకపోయినా పర్వాలేదు కాని వాటిని మరిపించే కామెడీ టైమింగ్ లేకుంటే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆచారి అమెరికా యాత్ర ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
తమన్ కూడా హెల్ప్ లెస్ అయ్యాడు. రెండు మూడు పాటలు బాగానే అనిపించినప్పటికీ అసలైన విషయం బోల్తా కొట్టడంతో ఏమి చేయలేకపోయాడు. ఉన్నంతలో తమనే కాస్త నయం అని చెప్పుకోవచ్చు.బ్యాక్ గ్రౌండ్ మాత్రం నాసిరకం. డార్లింగ్ స్వామి మాటలు తీసికట్టుగా ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా రాసారు అంతే. సిద్దార్థ్ రామస్వామి కెమెరా పనితనం మంచి స్టాండర్డ్ లోనే ఉంది. అమెరికా ఎపిసోడ్ మొత్తం రొటీన్ గా ఉన్నప్పటికీ ఆ మాత్రం చూడబుద్ది వేసింది అంటే దానికి కారణం అతనే. ఎడిటింగ్ మాత్రం చాలా తీసికట్టుగా ఉంది. అనవసరమైన కామెడీ సన్నివేశాలు లేపేసే అవకాశం ఉన్నా దర్శకుడి ఒత్తిడో లేక ఇంకేదైనా కారణం ఉందేమో కాని మొహమాటానికి పోయి సినిమా భారంగా మార్చడంలో ఈయన కృషి కూడా ఉందేమో అనిపిస్తుంది. కేవలం కథ మీద నమ్మకంతో విష్ణు మార్కెట్ కి ఈ కథ డిమాండ్ కు మించి ఖర్చు పెట్టిన నిర్మాతలు మాత్రం పూర్తి ప్రశంసలకు అర్హులు.
పాజిటివ్ పాయింట్స్ 
చెప్పడం కష్టం
నెగటివ్ పాయింట్స్ 
ఉన్నవే అవి
చివరి మాట 
ఏదో సరదాగా టైం పాస్ అవుతుంది, దర్శకుడు గతంలో తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఆచారి అమెరికా యాత్రకు వెళ్తే మానసిక ప్రమాదం జరగడం ఖాయం. నవ్వించని కామెడీతో, అర్థం కాని లవ్ స్టొరీతో, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియని గందరగోళంతో ఒక ఖంగాలీ సినిమాను చూడాలి అంటే ఆచారి అమెరికా యాత్ర బెస్ట్ ఛాయిస్. మూసలో పడితే కామెడీ సినిమా కూడా ఎంత దారుణంగా తయారవుతుందో చూపించడానికి తప్ప ఇంకెందుకు ఆచారి ఉపయోగపడలేదు.
ఆచారి అమెరికా యాత్ర- గోదారి మునక యాత్ర, జాగ్రత్త 
రేటింగ్ : 3.25/5

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments