ఫైనల్ చేరేదెవరు?

ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి సెమీస్‌లో టీమిండియాపై విజయం సాధించి న్యూజిలాండ్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. గురువారం బర్మింగ్‌హామ్‌ వేదికగా రెండో సెమీస్‌ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియా అలవోకగా సెమీస్‌లో అడుగుపెడితే.. ఆతిథ్య ఇంగ్లండ్‌ చెమటోడ్చి చేరింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇదే అవకాశం:

ప్రపంచకప్ కలను సొంతగడ్డపై సాకారం చేసుకునేందుకు ఇంగ్లాండ్ జట్టుకు ఇదే మంచి అవకాశం. చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ను ఎలాగైనా ఓడించి తుదిపోరులో అడుగుపెట్టాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆరో టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలో చిత్తుచేసినట్టే సెమీస్‌లోనూ ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ఫైనల్ చేరాలని భావిస్తోంది.

స్టార్క్‌, వార్నర్‌ కీలకం:

ఇరు జట్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమానంగా ఉన్నాయి. ఆసీస్‌కు బ్యాట్స్‌మన్‌ డేవిస్ వార్నర్‌, కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌లు పెద్ద బలం. వీరికి తోడు అలెక్స్ క్యారీ, మ్యాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌లు బ్యాట్ జుళిపిస్తే భారీ స్కోర్ ఖాయం. టోర్నీ టాప్ వికెట్ టేకర్ మిచెల్ స్టార్క్‌ జట్టులో ఉండడం సాలిసొచ్చే అంశం. కమిన్స్‌, బెహ్రెన్‌డార్ఫ్‌లతో ఆ టీమ్‌ బౌలింగ్‌ విభాగం కూడా పటిష్ఠంగా ఉంది. వీరిని అడ్డుకోవడం ఇంగ్లాండుకు కష్టమే.

ఓపెనర్ల జోరు:

మధ్యలో కొన్ని పరాయలు ఎదురైనా.. ఇంగ్లండ్ మళ్లీ విజయాల బాట పట్టింది. ప్రస్తుత ఫామ్ చూస్తే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ను ఆపడం కష్టమే. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టోలు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. జో రూట్‌, కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌, బెన్ స్టోక్స్‌, జోస్ బట్లర్‌తో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. బౌలింగ్‌లో మార్క్‌ ఉడ్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్ స్టోక్స్‌లు అదరగొడుతున్నారు. మరి వీరిని ఆసీస్ ఆటగాళ్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.

జట్లు (అంచనా):

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్‌, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌, స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌, స్టొయినిస్‌, నాథన్ లియాన్‌, జేసన్ బెహ్రెన్‌ డార్ఫ్‌, పాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌.

ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), జోస్ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, లియామ్ ఫ్లంకెట్‌, ఆదిల్ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌, మార్క్‌ ఉడ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here