బీజేపీతో తాళి కట్టించుకుంటాం

మేమే బీజేపీతో తాళి కట్టించుకుంటాం…బీజేపీతో మళ్లీ కలిసి పనిచేస్తాం…త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం అవుతుంది” అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన విషయం చెప్పారు. తాము ఇప్పుడు కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని…. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, అయితే ఇప్పుడు తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ కాదు… ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం టీడీపీలో తీవ్ర దుమారం రేపుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జేసీ సోదరులు పార్టీ మారుతున్నట్లు ‘అనంత’లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల నుంచి తనకు మంచి ఆఫర్‌ వచ్చిందని ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి చంద్రబాబు అవసరమన్నారు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదని గొప్ప ఆర్థికవేత్తని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here