అందుకే ‘ఎన్టీఆర్‌’ ఒప్పుకున్నా

0
177

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు రానా దగ్గుబాటి. కథానాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగానూ ఆయన రాణిస్తున్నారు. ఇటీవల ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా కోసం నిర్మాతగా మారారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ రానా సందడి చేస్తున్నారు.

తాజాగా ఓ ఆంగ్లపత్రిక రానా కొత్త బాలీవుడ్‌ సినిమాల గురించి ఆయన్ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నా సినిమా ‘హాథీ మేరీ సాథీ’ హిందీలోనూ ఉండబోతోంది (త్రిభాషా చిత్రం). ప్రస్తుతం నేను ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా. ఇది ఓ బయోపిక్‌, పెద్ద ప్రాజెక్టు. ఇందులో నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్నా. సినిమా షూటింగ్‌ ముగింపుకు దగ్గరలో ఉన్నాం, ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నా. నాకు ఇలాంటి పాత్రలంటే ఇష్టం. అందుకే సినిమాకు ఒప్పుకున్నా. ఎప్పుడూ ఓ పాత్ర గురించి చదివి.. దాన్ని అంచనా వేయకూడదు. సినిమాను ఎంత ఆసక్తికరంగా తెరపై చూపించగలిగాం అనేది ఇక్కడ ముఖ్యం’ అని అన్నారు.

అనంతరం రానా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నిజాయతీగా తీసిన సినిమా ఇది. ఇందులో సమాజాన్ని చూపించే విధానం నాకు చాలా నచ్చింది, నిజంగా ఇది అందమైన చిత్రం. అందుకే విడుదల చేసేందుకు ఒప్పుకున్నా. ఈ సినిమాను తొలిసారి చూసినప్పుడు.. పాత్రలు నాకు ముందే తెలుసు అన్న భావన కల్గింది. నిర్మాతలు కంచరపాలెం గ్రామం నుంచి వ్యక్తుల్ని ఎంచుకుని, వారికి నటన నేర్పించారు. ఇలాంటి సినిమాను ప్రమోట్‌ చేయాలి అనుకున్నా’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here