కొత్త పార్టీని ప్రకటించిన నటుడు ఉపేంద్ర

0
115

ప్రముఖ నటుడు ఉపేంద్ర  ఉత్తమ ప్రజాకీయ రాజకీయ పార్టీ(యూపీపీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని ఆయన నివాసంలో  ముఖ్యులతో కలసి కొత్త పార్టీ వివరాలను మీడియాకు వివరించారు. కర్ణాటక వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వచ్చే లోకసభ ఎన్నికలలో బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఉప్పిగా తన పేరు సుపరిచయమని అందులో ఐ అక్షరాన్ని వదిలేసి యూపీపీ పేరుతో ఉత్తమ ప్రజాకీయ పార్టీని ప్రారంభించానన్నారు.

పార్టీలో చేరేవారికి సమాజం గురించి అవగాహన కలిగించే రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు. సమాజంలో సామాన్యులకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించాలన్నదే ఆశయంగా పెట్టుకున్నామన్నారు. వైద్య సేవలకు సంబంధించి అమెరికాకు చెందిన వైద్యులు తనకు సహకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. అదే రీతిన విద్యాసౌకర్యాల మెరుగుకు ప్రత్యేక విధానాలు అవలంబించదలచామన్నారు. పార్టీలో చేరేవారందరినీ స్వాగతిస్తామన్నారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తమ పార్టీ ముఖ్యులకు శిక్షణనిచ్చేందుకు అంగీకరించారన్నారు. మాజీ లోకాయుక్త సంతోష్‌ హెగ్డే కూడా మద్దతిస్తానని ప్రకటించారని బెంగళూరులో ఆయన అందుబాటులో లేనందున సమావేశానికి హాజరుకాలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మేధావులు, విద్యావంతులు, సామాజిక అంశాలపై అవగాహన కలిగిన వారందరినీ కలుపుకుని పార్టీని నడుపుతామన్నారు.

గత ఏడాది కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ పేరిట ఆయన ఓ రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాని పార్టీలో విభే దాలు రావడంతో వ్యవస్థాపకులైన ఉపేంద్ర ముందుగానే పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఏడాది తిరక్కుండానే కొత్త సినిమా విడుదల తరహాలో రెండో రాజకీయ పార్టీని ప్రారంభించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here