టీడీపీ , వైసీపీ లకు డబ్బులిస్తేనే జనం వస్తారు …

0
183

2019 సంవ‌త్స‌రంలో స‌రికొత్త రాజ‌కీయ వ్య‌వ‌స్థ రాబోతుంద‌ని , ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడబోతోందని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ధీమా వ్య‌క్తం చేశారు . జ‌న‌సేన పార్టీకి జీవం జ‌న‌సైనికులే అని అన్నారు . నాయ‌కులు ఉండొచ్చు, వెళ్లిపోవ‌చ్చని… కానీ, జ‌న‌సైనికులు మాత్రం ఎప్పుడూ తనతోనే ఉంటార‌ని చెప్పారు. టీడీపీ, వైసీపీల‌కు డ‌బ్బులిస్తేనే జ‌నం వ‌స్తారని , జ‌న‌సేనకు మాత్రం స్వ‌చ్ఛందంగా, ప్రేమ‌తో వ‌స్తార‌ని వారు డ‌బ్బుకు అమ్ముడుపోయే వ్య‌క్తులు కాద‌ని అన్నారు . జ‌న‌సేన పార్టీలో చేరిన నాయ‌కులు జ‌న‌సైనికుల్ని గౌర‌వించాల‌ని, వారిని గౌర‌విస్తే తనను గౌర‌వించిన‌ట్లేన‌ని చెప్పారు . ఇన్ని సంవ‌త్స‌రాలు ఇంత ప్రేమ‌ను ఇచ్చిన మీకు తన తుది శ్వాస వ‌ర‌కు వెన్నంటే ఉంటానని, ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. విశాఖలో మాట్లాడుతూ పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు .

సినీ నటుడిగా తన ప్రయాణాన్ని ఉత్త‌రాంధ్ర నుంచి ఎలాగైతే ప్రారంభించానో రాజ‌కీయ ప్ర‌యాణాన్ని కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించానని పవన్ చెప్పారు . ఉత్తరాంధ్ర వెన‌కబ‌డిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టేసిన ప్రాంతమని ఆవేదన వ్యక్తం చేశారు . ఉత్త‌రాంధ్ర యాస, భాష‌, క‌ళ‌ల‌తో పాటు ఆత్మ‌ను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జ‌న‌సేన మాత్రమేనని చెప్పారు . ఈ ప్రాంత స్వ‌రూపాన్ని, స్వ‌భావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయ‌కుల‌కే జ‌న‌సేన పెద్ద‌పీట వేస్తుందని స్పష్టం చేశారు . 2003లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నానని  2009లో పోటీ చేయ‌క‌పోవ‌డానికి ముఖ్య కార‌ణం స‌మ‌స్య‌ల‌ను అర్ధం చేసుకోవ‌డం కోస‌మేనని చెప్పారు . 2014లో రాజకీయ సుస్థిర‌త కోసం టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చానని తెలిపారు . రాజ‌కీయాల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటే ఆనాడు బీజేపీని కేంద్ర‌మంత్రి ప‌ద‌విని అడిగేవాడినని టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు బేర‌సారాలు ఆడేవాడినని చెప్పారు . కానీ, దేశ రాజ‌కీయాల్లో విలువ‌లు బ‌తికే ఉన్నాయ‌ని చెప్పడానికే , అవేవీ ఆశించ‌కుండా మ‌ద్ద‌తు ప‌లికానని తెలిపారు .

జ‌న‌సైనికుల కోసం జులై 2 నుంచి శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయని పవన్ చెప్పారు . ప్ర‌తి జిల్లా నుంచి 3 వేల మందిని ఇందుకోసం ఎంపిక చేశామని తెలిపారు . ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి రాగానే ప‌ద‌విని కోరుకుంటున్నారని.. తాను మాత్రం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వెత‌క‌డం కోసం వ‌చ్చానని చెప్పారు.  త్రిక‌ర‌ణ శుద్ధితో, చాలా స‌హనంతో రాజ‌కీయాల్లో ఉంటున్నానని తెలిపారు . తనకు ఓపిక చాలా ఎక్కువని , ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం 12 ఏళ్లు ఎదురుచూసేంత అని చెప్పారు . 2019లో జ‌న‌సేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు . జనసేన నేతలంతా మ‌న‌స్పూర్తిగా పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌ని కోరుకుంటున్నానని చెప్పారు . మేధావుల స‌ల‌హాలతో పార్టీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here